రాత్రి భోజనం పెట్టలేదని భార్య తలనరికి, చర్మం ఒలిచి..!

  • కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో దారుణం
  • కునిగల్ తాలూకాకు చెందిన దంపతుల మధ్య తరచూ తగవులు
  • సోమవారం రాత్రి మళ్లీ గొడవపడ్డ దంపతులు
  • భార్య తనకు భోజనం పెట్టకపోవడంతో రెచ్చిపోయిన భర్త  
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. భార్య తనకు రాత్రి భోజనం పెట్టలేదన్న కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి ఆమె తలనరికి చంపేశాడు. తుముకూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే, కునిగల్ తాలూకాకు చెందిన శివరామ, పుష్పలతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. కాగా, సోమవారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు. దాంతో ఆ రాత్రి ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహంలో విచక్షణ మరిచిన శివరామ కత్తితో ఆమె తల నరికేశాడు. ఆ తరువాత రాత్రంతా ఆమె చర్మం మొత్తం ఒలిచాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఘటన జరిగిన సమయంలో వారి కుమారుడు నిద్రిస్తున్నాడు. 

మరునాడు ఉదయం తను పని చేస్తున్న సంస్థ యజమానులకు నిందితుడు సమాచారం అందించాడు. వారు పోలీసులకు విషయం చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాగా, ఘటన స్థలిలో తమకు మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పోలీసులు చెప్పారు. నిందితుడు ఆమె చర్మం పూర్తిగా ఒలిచాడని తెలిపారు. నిందితుడు కూడా అక్కడే ఉన్నాడని, అతను నేరం అంగీకరించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడుని అరెస్ట్ చేశారు. 

Karnataka
Crime News

More Telugu News